జ్ఞాపకం ఉండేలా చదవడం ఎలా...??? - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Thursday, 26 April 2018

జ్ఞాపకం ఉండేలా చదవడం ఎలా...???

పరీక్షల్లో బాగా రాయాలంటే బాగా జ్ఞాపకం ఉండాలి. బాగా జ్ఞాపకం ఉండాలి అంటే బాగా చదివి ఉండాలి. జ్ఞాపకం ఉండేలా చదవడం ఎలా అనేది విద్యార్థులను ఎక్కువగా వేధించే ప్రధాన ప్రశ్న. ఎప్పుడో చదువుకున్న విషయాలను మేధావులు జీవితకాలమంతా ఎలా గుర్తుంచుకుంటారు. ముఖ్యంగా అవధానాలు చేసేవారు జ్ఞాపకం కోసం ఎలాంటి టెక్నిక్స్‌ వాడతారు. అష్ట, శత, సహస్ర అవధానాల్లో పృచ్ఛకుల ప్రశ్నలకు వారు ఎలా సమాధానం ఇవ్వగలుగుతారు. ఈ విషయాలను విద్యార్థులకు వివరిస్తున్నారు సహస్రావధాని గరికపాటి నరసింహారావు.
ఏ విషయమూ జ్ఞాపకం ఉండదు. జ్ఞాపకం పెట్టుకోవాలి, అంతే. సాధారణగా జ్ఞాపక శక్తి అందరికీ ఒకే విధంగా ఉంటుంది. అయితే గుర్తుంచుకోవడానికి కొంత మంది ఒక పద్ధతిని పాటిస్తుంటారు. అదే జ్ఞాపకశక్తి. మేము అవధానాలు చేసేప్పుడు సహస్రావధానంలో వేయిమంది పృశ్చకుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాం. అదేమీ అంతర్గత శక్తి కాదు. కొందరు దాన్ని మహత్తర శక్తిగా అభివర్ణిస్తుంటారు. అది పూర్తిగా పొరపాటు అభిప్రాయం. మనుషులు మొదలుకుని సమస్త జీవులూ తమకు అవసరమైనవి గుర్తుపెట్టుకుంటాయి. మేమూ అంతే. అందుకే దానికి వ్యతిరేక పదం ’మర్చిపోవడం’ కూడా ఉంది. చెడుని గుర్తుపెట్టుకోవద్దని అందుకే మన పెద్దలు చెబుతుంటారు. దానిలోనే అవసరమైనవి మాత్రమే గుర్తుపెట్టుకోండన్న సలహా కూడా ఉంది.
పద్ధతిగా చదువుకుంటే ఏ విషయమైనా గుర్తు ఉంటుంది. ఉదాహరణకు పద్యం నేర్చుకోవడం తీసుకుందాం. మొదట దానికి అర్థం తెలుసుకోవాలి సాధారణంగా పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. దేనికదిగా అంతం కాదు. అందువల్ల అర్థవంతంగా తీసుకోవాలి. తరవాత ఒక్కో పాదం మొదట ఒకసారి, తదుపరి మళ్ళీ రెండు సార్లు చదవాలి. అచ్చులో ఉన్నది చూస్తూ చదవాలి. తరవాత పుస్తకం మూసేసి మనకి మనమే అప్పజెప్పుకోవాలి. మధ్యలో గుర్తుకు రాకుంటే, ఆ పదం ఒక్కటి చూడాలి. మళ్ళీ దాన్ని కలిపి అప్పజెప్పుకోవాలి. పద్యం అంతా వచ్చేస్తుంది.
ఏ సబ్జెక్టుకైనా ఇదే పద్ధతి. నాలుగైదు వాక్యాలుగా విడదీసుకుని చదవాలి. కొన్ని వ్యాసరూప జవాబులు ఉంటాయి. పేరాలుగా విభజించుకుని చదవాలి.
పుస్తకాన్ని సగం మూసి పెట్టుకోవడం, మధ్య మధ్యలో తీసి చదవడంతో ఏదీ సరిగ్గా గుర్తు ఉండదు. చదువుతున్నప్పుడు పుస్తకాన్ని చూసి చదవాలి. దీన్ని ఫొటోగ్రాఫిక్‌ మెమొరీ అంటారు.
ఉదాహరణకు ‘రాముడు అరణ్యానికి వెళ్ళాడు. మారీచుడు అనే రాక్షసుడిని చంపాడు’ అని ఉందనుకోండి. మనకు మనం అప్పజెప్పుకొనేటప్పుడు రాక్షసుడి పేరు గుర్తుకు రాలేదు. అప్పుడు మళ్ళీ ఆ ఒక్కటి చదవండి చాలు. అలాగే వ్యాసరూప ప్రశ్నలకు ముఖ్యమైన పాయింట్స్‌ గుర్తు పెట్టుకోవాలి. వాటిని బట్టి మిగతాదంతా గుర్తుకువస్తుంది.
శ్రవణం, పునశ్చరణ అన్న రెండు పద్ధతులూ పాటించాలి. మొదట జాగ్రత్తగా వినాలి. తరవాత తప్పులు లేకుండా అర్థం చేసుకుంటూ చదువుకోవాలి. తిరిగి పునశ్చరణ చేసుకోవాలి.
ఎంత పెద్దదైనా బిట్లుగా విడగొట్టుకుంటే సులువుగా చదువుకోవచ్చు. తరవాత అంతా కలిపి చదువుకోవాలి. సమగ్రరూపం వస్తుంది. సులువుగా గుర్తు ఉంటుంది.
ఒకసారి రాస్తే పది సార్లు చదివినంత ప్రయోజనం. మనసు ఎక్కడో పెట్టి రాయకూడదు. దానిపైనే లగ్నం చేస్తూ రాయాలి. రాముడు రాయాలనుకోండి. అది రాసేలోపు మనసుపెడితే కనీసం మూడు సార్లయినా మననం జరుగుతుంది. పెద్ద పదం అయితే నాలుగైదు సార్లు జరుగుతుంది. తద్వారా సులువుగా గుర్తుకువస్తుంది.
ఏదీ ఆయాచితంగా వచ్చేయదు. తదునుగుణ్యమైన కృషి చేయాలి. అప్పుడే దేనిపైనైనా పట్టు చిక్కుతుంది.
నా వరకు తీసుకుంటే టెన్త్‌ తప్పాను. అయిదుగురు అన్నదమ్ముల్లో నేను ఒక్కడినే మొదటి సారి టెన్త్‌ పాస్‌కాలేకపోయాయాను. అయినప్పటికీ మా నాన్నగారు నన్ను ఏమీ అనలేదు. రుబ్బితే పిండి మరింత మెత్తనై, గారెల రుచి పెరుగుతుందని అన్నారు. మరొక్క ఏడాది చదివి.. ముందుకంటే మంచి మార్కులు తెచ్చుకున్నాను. మొదటి సారి అన్నీ కలిపి 600కి 280 వస్తే, రెండో సారి 440 మార్కులు ఆ రోజుల్లో తెచ్చుకున్నాను.
నువ్వెందుకూ పనికి రావని మా నాన్నగారు నన్ను తిట్టలేదు. మన వంశంలో నువ్వొక్కడివే టెన్త్‌ తప్పావని తూలనాడలేదు. అయిదు వేళ్ళూ ఒక్కలా ఉండవని చెప్పి, అనునయించారు. ప్రోత్సహించారు. తల్లిదండ్రులంతా ఇలాంటి విషయాలను గుర్తుంచుకోవాలి. మెడిసిన్‌లోనో, ఐఐటిలోనే సీటు రానంతమాత్రాన పిల్లల్ని చిన్నబుచ్చవద్దు. వారి తెలివికి తగ్గది మరొకటి చూపండి. ఆ స్థాయిలో చదివే పిల్లలకు మరొక దాన్లో తేలికగానే సీటు వస్తుంది. మార్కులే జీవితం అని చెప్పవద్దు. మానసికంగా వారిని వేధించవద్దు. మొదటి చిన్న లక్ష్యాలు పెట్టండి. తరవాత అంతిమ గమ్యం చేరుకునేలా చూడండి. పాతికకు పది మార్కులు వచ్చినప్పుడు మళ్ళీ సారి మరికొంచెం పెంచుకోవాలని చెప్పండి. చివరగా మీరు అనుకున్న లక్ష్యం మెల్లమెల్లగా చెప్పి అక్కడికి చేరుకునేలా చూడండి.
నా విషయానికి వస్తే మొదట్లో ఇరవై నిమిషాలు చదివితే ఒక పద్యం వచ్చేది. ఇప్పుడు కొత్త పద్యాన్ని కేవలం రెండు నిమిషాల్లో నేర్చుకుంటున్నాను. ఇది మరికొందరికి ఇరవై నుంచి అర్థ గంట సేపు పట్టవచ్చు. అంతే తప్ప రాకపోవడం అంటూ ఉండదు. మన కృషి ముఖ్యం. మహానుభావుల పాదాలకు దండం పెడితే ఏమీ రాదు. నోటిలో బీజాక్షరాలు రాయించుకున్నా రాదు.
నేను గంట సేపు మాట్లాడాలని అనుకుంటే కనీసం ఆరు పద్యాలు నేర్చుకుని వెళతాను. ముందుగానే ఆ పద్యాలు వస్తే మాట్లాడాల్సిన రోజు ఉదయం పునశ్చరణ చేసుకుంటాను.
చివరగా తల్లిదండ్రులకు నాదొక విన్నపం. మీ పిల్లలు భవిష్యత్తులో మంచివాళ్ళు కావాలని కోరుకోండి. గొప్పవాళ్ళు కావాలని అనుకోవద్దు. గొప్పవాళ్ళు అంటే ఈ రోజుల్లో బాగా డబ్బు సంపాదించిన వ్యక్తులు అని అర్థం. ఎంత డబ్బు సాధించినా మంచి వాళ్ళు కాకుంటే వారితో ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించండి.
చదువులో శ్రవణం, పునశ్చరణ అన్న రెండు పద్ధతులూ పాటించాలి. మొదట జాగ్రత్తగా వినాలి. తరవాత తప్పులు లేకుండా అర్థం చేసుకుంటూ చదువుకోవాలి. తిరిగి పునశ్చరణ చేసుకోవాలి. అంతేతప్ప మహానుభావుల పాదాలకు దండం పెడితే, నోటిలో బీజాక్షరాలు రాయించుకుంటే చదువురాదు, జ్ఞాపకం ఉండదు. చదువులో కృషి ముఖ్యం.
ఏ విషయమూ ఎవరికీ ఎల్లకాలం జ్ఞాపకం ఉండదు. జ్ఞాపకం పెట్టుకోవాలి, అంతే. జ్ఞాపక శక్తి అందరికీ ఒకే విధంగా ఉంటుంది. అయితే గుర్తుంచుకోవడానికి కొంత మంది ఒక పద్ధతిని పాటిస్తుంటారు. అదే జ్ఞాపకశక్తి. మేము అవధానాలు చేసేప్పుడు సహస్రావధానంలో వేయిమంది పృశ్చకుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాం. అదేమీ అంతర్గత, మహత్తర శక్తి కాదు.
డాక్టర్‌ గరికపాటి నరసింహారావు
సహస్రావధాని

No comments:

Post a Comment