సుమారు పాతికేళ్ల కిందట ఆర్థిక సంస్కరణలను పట్టాలకెక్కించినప్పుడు అవి ఎంత కాలం మన్నుతాయన్న చర్చ జోరుగా సాగింది. స్థానిక సంస్థలను సవ్యంగా తీర్చిదిద్దితే తప్ప ఆర్థిక సంస్కరణలకు దీర్ఘకాలిక మన్నిక ఉండదని నిపుణులందరూ ఆనాడు సూచించారు. దురదృష్టవశాత్తూ ఇంటిని చక్కదిద్దుకునే సంస్కరణలపైన మన విధానకర్తలు పాతికేళ్లుగా పెద్దగా దృష్టి సారించలేకపోయారు. స్థానిక పాలనకు పెద్దపీట వేస్తూ తీసుకువచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణలు కొత్త ఆశలు రేకెత్తించాయి. మధ్యప్రదేశ్, కేరళ, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్‌లలో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఈ సంస్కరణలను కొంతవరకు నిజాయతీగా అమలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో సహా దేశంలోని అనేక రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో ఈ సంస్కరణలను పట్టించుకున్న దాఖలాలే లేవు. 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తిని దాదాపుగా అన్ని రాష్ట్రాలూ విస్మరించాయి. ఏ రాష్ట్రమూ నగర పాలికలకు అత్యున్నతాధికారాలు ప్రసాదించిన పాపాన పోలేదు. పార్లమెంటు 1996లో షెడ్యూల్డు ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ చట్టం తీసుకువచ్చింది. ఇరవయ్యేళ్లు గడచినా ఏ రాష్ట్రమూ ఆ చట్టం అమలు దిశగా ఒక్క అడుగైనా ముందుకు వేయలేదు. దీని అమలు ఇప్పటికీ ప్రాథమిక స్థాయిలోనే నిలిచి ఉంది. ఎన్నో ఆశలతో 2004లో ఏకంగా పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. కానీ, దానివల్లా పెద్దగా ఏమీ ఒరగలేదు. పంచాయతీలకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(ఎంఎన్‌ఆర్‌ఈజీఈ) కార్యక్రమం ప్రవేశపెట్టారు. దానితో దేశంలోని పల్లెపట్టుల ముఖచిత్రం ఒక్కపెట్టున మారుతుందని చాలామంది ఆశించారు. వారి ఆశలు అడియాశలుగానే మిగిలాయి. పద్నాలుగో ఆర్థిక సంఘం కేటాయింపులు మరోసారి కొత్త ఆశలు రేకెత్తించాయి. గ్రామ పంచాయతీలకు ఈ సంఘం రెండు లక్షల 292 కోట్ల రూపాయలు కేటాయించింది. దీనికి 2015-2020 మధ్యకాలంలో ఎంఎన్‌ఆర్‌ఈజీఈ నిధులనూ జతకూరిస్తే పంచాయతీలకు మొత్తంగా సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేటాయించినట్లవుతుంది. గ్రామ సీమల వికాసానికి దీన్ని ఓ మహత్తర అవకాశంగా వినియోగించుకోవచ్చు.
అరకొరగా గ్రామసభలు
దేశంలోని అనేక రాష్ట్రాల్లో గ్రామ సభలు పని చేయడమే లేదని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా ఈ సభలు జరిగినా 10 నుంచి 20 మంది సభ్యులు మాత్రమే వాటికి హాజరవుతున్నారు. గ్రామ సభలకు అధికారాలు అప్పగించాలని రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశిస్తున్నా ఖాతరు చేస్తున్నవారు కనిపించకపోవడం బాధాకరం. గ్రామ సభల నిర్వహణ తీరు అత్యంత బలహీనంగా ఉంది. కారుచీకట్లో కాంతిరేఖలా దేశవ్యాప్తంగా స్వయం సహాయ బృందాలు పెద్దయెత్తున విస్తరించడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. దేశంలోని 1500 బ్లాకుల్లో స్వయం సహాయ బృందాలు శక్తిమంతంగా ఉన్నాయి. అత్యంత వెనకబడిన వర్గాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ బృందాల్లో స్ఫూర్తి నింపి, గ్రామ సభలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చేయగలిగితే దేశంలోని గ్రామీణ పేదలకు, మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇక పురపాలికల్లో గ్రామ సభ భావనే లేదు. రాజ్యాంగంలోని 243 (ఎస్) అధికరణలో వార్డు కమిటీల గురించి విస్తృతంగా చర్చించారు. దేశంలో మూడు లక్షల జనాభాకు ఓ పురపాలిక ఉంది. అయితే ఈ వార్డు కమిటీలు ఏ మాత్రం ప్రభావశీలంగా లేవు. కీలకమైన బాధ్యతలు అప్పగించకపోవడమూ వీటి
బలహీనతకు ఒక కారణం.
జనాభా పెరుగుతున్న నేపథ్యంలో భూమి, ఇసుక, కంకర, రాయి, ఖనిజాలు, నీళ్లు, అటవీ సంపద వంటి సహజ వనరులకు అంతకంతకూ గిరాకీ ఇనుమడిస్తోంది. అధికార పార్టీలు ఈ వనరులను తమ తాబేదారులకు కట్టబెట్టడంకోసం గ్రామ సభలు, పంచాయతీల మెడలు వంచుతున్నాయి. స్థానిక సంస్థలను తోసిరాజంటూ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న విధానం పంచాయతీ పాలన స్ఫూర్తిని నీరుగారుస్తోంది. స్థానిక పంచాయతీల్లో చోటు చేసుకుంటున్న ఇసుక అక్రమ తవ్వకాలపై వార్తా కథనాలు ప్రచురించినందుకుగాను మధ్యప్రదేశ్, యూపీ, అస్సామ్ రాష్ట్రాల్లో ముగ్గురు పాత్రికేయులను క్రితం నెల చంపివేశారు. స్థానిక వనరులు ఏ స్థాయిలో పక్కదారిపడుతున్నాయో చెప్పేందుకు ఇది ఓ ఉదాహరణ. మరోవంక పల్లెల నుంచి పట్టణాలుగా రూపాంతరం చెందుతున్న చిన్నపాటి పట్టణ తరహా సముదాయాలను నగర పంచాయతీలుగా తీర్మానించారు. భారత దేశ ముఖచిత్రం పల్లెలనుంచి మెల్లగా పట్టణాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో నగర పంచాయతీ భావనకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. దురదృష్టవశాత్తూ స్థానిక పాలన గొలుసుకట్టులో నగర పంచాయతీలే అత్యంత బలహీనంగా ఉన్నాయి. ‘ఏది చిన్న తరహా పట్టణ ప్రాంతం, ఏది పెద్ద పట్టణం, ఏది పల్లెనుంచి పట్టణంగా రూపాంతరం చెందుతున్న ప్రాంతం వంటి విషయాల నిర్ధారణకు రాష్ట్ర గవర్నరు కచ్చితమైన నిబంధనలు రూపొందించాలి’ అని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. కానీ దేశంలో వేళ్లమీద లెక్కపెట్టగల సంఖ్యలోని రాష్ట్రాలే రాజ్యాంగ నిర్దేశాలు పాటించాయి. పల్లెలనుంచి పట్టణాలకు వలసలు ఇనుమడిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థలూ బలం పుంజుకోవాల్సి ఉంది. దురదృష్టవశాత్తూ ఇది జరగడం లేదు. సాధ్యమైనంతవరకూ గ్రామ పంచాయతీలను పట్టణ పురపాలికలో కలిపేయాలన్న లోపాయకారి ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. పంచాయతీలతో పోలిస్తే పురపాలికలతోనే ప్రభుత్వాలకు ఎక్కువ సానుకూలత ఉండటం
ఇందుకు కారణం!
అయిదేళ్లకు ఓ మారు స్వేచ్ఛగా, స్వతంత్రంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించుకోగలగడం ప్రజాస్వామ్య భారతం సాధించిన అతిపెద్ద విజయం. ఏ కారణంవల్లనైనా అయిదేళ్లలోగా ఎన్నికలు జరపని పక్షంలో- ఆరు నెలలకు మించి ఆ పరిస్థితిని కొనసాగించడానికి వీల్లేదు! మరోవంక రాజ్యాంగంలోని 243 (డబ్ల్యూ) అధికరణ ప్రకారం పురపాలికలకు నిర్దిష్ట కాలావధిలో ఎన్నికలు నిర్వహించాలి. అయితే రాజ్యాంగ అధికరణలోని ఓ చిన్న మెలికను అవసరానుగుణంగా వ్యాఖ్యానించే పరిస్థితి ఉండటంతో పురపాలికలకు అధికారాల బదిలీ తరచూ సంక్షోభంలో పడుతోంది. ‘చట్టానుసారం రాష్ట్ర ప్రభుత్వాలు పురపాలికలకు అధికారాలు కట్టబెట్టవచ్చు’. ఇక్కడ ‘కట్టబెట్టవచ్చు’ అన్న మాటను తమకు అనుకూలంగా మలచుకొని, ప్రభుత్వాలు పురపాలికలకు బొత్తిగా అధికారాలు ప్రసాదించకుండా తాత్సారం చేస్తున్నాయి. కాబట్టి ఈ మాటకు తక్షణం తగిన సవరణ చేసి ‘కట్టబెట్టాలి’ అని మార్చాల్సి ఉంది. పురపాలికలకు అధికారాలు, బాధ్యతలు బదలాయించని పక్షంలో అవి నామమాత్రావశిష్టంగానే మిగిలిపోతాయని గుర్తించాలి. భారత్‌తో పోలిస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో స్థానిక సంస్థలు అత్యంత బలోపేతంగా ఉన్నాయి. మరోవంక ‘రొటేషన్’ పద్ధతిని అయిదేళ్లకు ఓమారు కాకుండా పదేళ్లకు మార్చాలి. తద్వారా దళిత మహిళలకు అయిదేళ్ల తరవాత మరో పర్యాయం అదే నియోజకవర్గంనుంచి పోటీచేసి, తిరిగి ఎన్నిక కావడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఆయా నియోజకవర్గాల్లో సామాజికంగా, రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఆ మహిళలకు వీలు దొరుకుతుంది.
సగం వాటా వైపు...
` స్థానిక సంస్థల్లో మూడింట ఒకవంతు సీట్లలో మహిళలకు చోటుపెట్టాలని రాజ్యాంగ సవరణ నిర్దేశిస్తున్నా- ఆరు మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ స్వచ్ఛందంగా 50శాతం కోటా అమలు చేస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, గోవా, హరియాణా, జమ్మూ కశ్మీర్, మణిపూర్, ఉత్తర్ ప్రదేశ్‌లు మాత్రం మూడింట ఒకవంతు పద్ధతి ప్రకారమే ముందుకు వెళుతున్నాయి. స్థానిక సంస్థల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్‌ను తప్పనిసరి చేస్తూ రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంది. మహిళా కోటా సీట్లను అయిదేళ్లకోమారు మార్చే ‘రొటేషన్’ విధానంపైనా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉంది. పితృస్వామిక భావజాలం అణువణువునా పరచుకుపోయిన దేశంలోని స్థానిక సంస్థల్లో మహిళలకు కోటా ఇవ్వడంవల్ల ఎన్నో సత్ఫలితాలు సాకారమయ్యాయి. ఇప్పటికీ భార్యలను నామమాత్రంగా ముందు పెట్టి భర్తలే అసలు అధికారం చెలాయిస్తున్న సంప్రదాయం కొనసాగుతున్నా, క్రమంగా ఆ ధోరణి మారుతోంది! స్వయంప్రతిపత్తి కీలకం
మొత్తంగా ప్రభుత్వ వ్యయంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు చేసే కేటాయింపులు చైనాలో 50 శాతం కాగా, దక్షిణాఫ్రికాలో 28శాతం, బ్రెజిల్‌లో 20శాతంగా ఉన్నాయి. భారత్‌లో ఇది మూడుశాతమే కావడం గమనార్హం. జాతీయ గ్రామీణాభివృద్ధి కార్యక్రమం నిధులనూ జోడిస్తే ఈ కేటాయింపుల ఖర్చు ఆరునుంచి ఏడుశాతం మధ్యలో ఉండవచ్చు. పద్నాలుగో ఆర్థిక సంఘం కేటాయింపులు పెంచిన నేపథ్యంలో ఈ మొత్తం ఆరుశాతానికి అటుఇటుగా ఉండవచ్చునని అంచనా! బ్రెజిల్, దక్షిణాఫ్రికా, చైనా వంటి దేశాల్లో స్థానిక సంస్థల బలోపేతానికి విస్తృతంగా నిధుల కేటాయింపు జరుగుతుంటే- భారత్ మాత్రం ఈ విషయంలో తీవ్రమైన వెనకబాటులో ఉండటం బాధాకరం. ఆర్థిక పురోగతి, సంస్కరణలు, సమ్మిళితాభివృద్ధి కోసం స్థానిక సంస్థలను బలోపేతం చేయడం తక్షణావసరం. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ఎనిమిది శాతానికి చేరాలంటే స్థానిక సంస్థలకు జవసత్వాలు కల్పించడమే మార్గం. స్థానికంగా మౌలిక సౌకర్యాల సృష్టికి పంచాయతీయే మూలబిందువుగా మారాలి. వ్యవసాయ సంఘాలు, స్వయం సహాయ సహకార బృందాలు, వృత్తిపనివారి సంఘాలు వంటి వాటన్నింటినీ పంచాయతీల మమేకం చేయాలి. అన్ని రకాల స్థానిక సంఘాలకూ మౌలిక వనరులు కల్పించే కీలక కేంద్రంగా పంచాయతీని విస్తరించాలి. స్థానిక సంస్థల ద్వారా వివిధ సేవలను, వనరులను వ్యక్తులకు బదలాయించే క్రమంలో సాంకేతికతను మెరుగ్గా వినియోగించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలవద్ద పౌరుల వివరాలు ఇప్పటికే నమోదై ఉన్నాయి. ప్రభుత్వాలు సామాజిక, ఆర్థిక సర్వేలు సైతం నిర్వహించిన నేపథ్యంలో- స్థానికంగా పౌరులకు సేవలు, వనరుల బదలాయింపు పారదర్శకంగా, ప్రభావవంతంగా జరపడం అసాధ్యమేమీ కాదు. ప్రతి విభాగానికి ఒక ‘వెబ్‌సైట్’ను నిర్వహిస్తూ, జరిగిన పనులకు సంబంధించిన రసీదులను ఎప్పటికప్పుడు అందులో ఉంచుతూ, లబ్ధి పొందిన, పొందాల్సిన పౌరుల వివరాలను నిరంతరం నమోదు చేయగలిగితే పాలన పారదర్శకంగా కొనసాగుతుంది. స్థానిక సంస్థలకు స్వయంప్రతిపత్తి కల్పించడంపై తక్షణం దృష్టిసారించాలి. వికేంద్రీకరణ స్ఫూర్తికి పట్టం కడుతూ నిధులను, బాధ్యతలను పంచాయతీలకు బదలాయించాలి. ప్రజాస్వామ్య ప్రక్రియలో పంచాయతీలకు చురుకైన భాగస్వామ్యం కల్పించాలి. ప్రతి అయిదేళ్లకు ఓ మారు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహిస్తూ- స్థానిక సంస్థలను ప్రజాస్వామ్య భారతికి పునాదిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వాల చారిత్రక కర్తవ్యం కావాలి!
No comments:
Post a Comment