బూచాళ్ల భరతం పట్టే వ్యూహం - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Monday, 23 April 2018

బూచాళ్ల భరతం పట్టే వ్యూహం



అబలపై సాగే పురుషాధిక్య ఉగ్రవాదం- అత్యాచారం. ‘ఇండియా అంటే నేరాలు, అత్యాచారాలు తప్ప మరేమీ కాదన్నట్లుంది’ అంటూ నాలుగు రోజుల క్రితం బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్య నానాటికీ దిగజారుతున్న పరిస్థితులకు నిలువుటద్దం. పసినలుసుల నుంచి ముసలి ఒగ్గుల దాకా ఇంటాబయటా ఎక్కడా రక్షణలేని వాతావరణం- పేరు గొప్ప చట్టాల ఉనికినే ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకం చేస్తోంది. దిల్లీకి చెందిన ఎనిమిది నెలల చిన్నారిపై మేనమామ అత్యాచారానికి ఒడిగట్టిన దారుణంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా- చిన్నారులపై అఘాయిత్యానికి ఒడిగడితే మరణదండన విధించేలా శిక్షాస్మృతిని సవరించదలచినట్లు కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇరవై నాలుగ్గంటలు తిరగకుండానే కేంద్ర మంత్రివర్గం- భారత శిక్షాస్మృతి, సీఆర్‌పీసీ, పోక్సో సవరణల్ని ప్రతిపాదించడం, రాష్ట్రపతి సంతకంతో అత్యవసరాదేశం (ఆర్డినెన్స్‌) వెలువడటం చకచకా సాగిపోయాయి. జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై సాగిన అమానుషం జాతి సుప్తచేతనను జ్వలింపచేసిన నేపథ్యంలో- పన్నెండేళ్లలోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు జీవితకాలం జైలు లేదా ఉరిశిక్ష విధించేలా అత్యవసరాదేశ నిబంధనలు రూపుదిద్దుకొన్నాయి. మహిళలపై అత్యాచారాలకు ఇప్పటిదాకా ఉన్న కనిష్ఠ శిక్షను పదేళ్లకు పెంచి, జీవితఖైదూ విధించగలిగేలా కొత్త నియమావళి అమలులోకి వచ్చింది. అన్ని రకాల అత్యాచార ఘటనలపై దర్యాప్తు, విచారణలు రెండు నెలల్లోగా ముగిసిపోవాలని, అప్పీళ్లపై నిర్ణయమూ ఆర్నెల్లలో తెమిలిపోవాలని తాజా నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. బాలికలపై అత్యాచారాల నిరోధాన్ని లక్షిస్తూ 2012లో పోక్సో చట్టం తెచ్చిన తరవాతా నేరాల ఉరవడి ఏటికేడు పెరుగుతున్న నేపథ్యంలో- పాత చట్టాలకు కొత్తగా సానపట్టినంత మాత్రాన అరాచక పోకడలు ఆగిపోతాయా అన్న సహేతుక భయసందేహాలు ముమ్మరిస్తున్నాయి!

నిబంధనలు లేక కాదు, సుపరిపాలన కొరవడినందువల్లనే చట్టాలు చట్టుబండలై అభద్ర వాతావరణం రాజ్యమేలుతోందని నిర్భయ చట్టం రూపశిల్పి జస్టిస్‌ జేఎస్‌ వర్మ లోగడ నిష్ఠురసత్యం పలికారు. ఇండియా లాంటి పెద్దదేశంలో ఏవో ఒకటి రెండు దుర్ఘటనల్ని పట్టుకొని గుండెలు బాదుకోవడం సరికాదన్న కేంద్ర సచివుడి వ్యాఖ్యలు- క్షీణ విలువలకు ఆనవాళ్లు. పదేళ్ల కాలంలో చిన్న పిల్లలపై లైంగిక నేరాలు అయిదు రెట్లు పెరిగాయంటున్న స్వచ్ఛంద సంస్థ ‘క్రై’- ప్రతి పదిహేను నిమిషాలకొక ఘోరం చోటుచేసుకుంటోందని గణాంక సహితంగా వెల్లడించింది. యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, దిల్లీ, పశ్చిమ్‌ బంగల్లోనే మొత్తం నేరాల్లో సగం నమోదవుతుండగా, ఉభయ తెలుగు రాష్టాల్లోనూ ఆందోళనకర స్థితిగతులే నెలకొన్నాయి. ఆరేళ్లలోపు బాలికలపై అత్యాచారాల్లో తెలంగాణ రెండు, ఏపీ అయిదో స్థానాల్లో ఉన్నట్లు 2015 జాతీయ నేరగణాంక సంస్థ నివేదిక చాటుతోంది. పసితనంపై పైశాచికత్వానికి పాల్పడుతున్నవారిలో 95శాతం కుటుంబ సభ్యులో, పరిచయస్తులో, సన్నిహితులో ఉంటుండటం సామాజిక జీవన విలువల క్షీణతకు నిదర్శనం. చరవాణి ద్వారా అరచేతి అద్భుతంగా పిన్నాపెద్దా అందరికీ అందుబాటులోకి వచ్చిన అంతర్జాలంలో అశ్లీల వెబ్‌సైట్ల ఉరవడి నైతిక విలువలకు నిలువునా తలకొరివి పెట్టేస్తోందన్నది నిజం. అంతకుమించి పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, మాననీయ విలువలకు శతాబ్దాలుగా గొడుగుపడుతూ వచ్చిన భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, పాఠశాలల్లో నైతికాంశాల బోధనలు పూర్తిగా కొడిగట్టిపోయాయి. చిన్న పిల్లల మీద లైంగిక దాడుల విశృంఖలత్వాన్ని ప్రేరేపిస్తున్న వెబ్‌సైట్లలో 90 శాతం కెనడా, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, రష్యా, అమెరికాలవేనని తెలిసినా వాటిని కట్టడి చెయ్యలేని ప్రభుత్వాల అసమర్థత పసినలుసుల ఉసురు తీసేస్తోంది. అత్యాచారం వంటి అమానుష నేరాల్ని అదుపు చెయ్యాలంటే సామాజిక విలువల పెంపుదలకు సాంఘిక సంస్కరణోద్యమం అన్ని స్థాయుల్లోనూ ఉవ్వెత్తున సాగాలి!

అత్యాచారాలు పెచ్చరిల్లుతున్నాయంటే- సమాజంలో కుసంస్కారం కుబుసం విడిచిందని, శిక్షలంటే నదురు బెదురు లేక నేరగాళ్లు చెలరేగుతున్నారని అర్థం చేసుకోవాలి. అసహజ లైంగిక వాంఛల విశృంఖలత్వం కమ్మేసిన విషపూరిత వాతావరణంలో ముక్కుపచ్చలారని బాలికలతోపాటు బాలురూ బాధితులుగా మారిపోతున్నారన్న నిజాన్ని గుర్తించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు తక్షణం కర్తవ్యోన్ముఖం కావాలి. అశ్లీల వెబ్‌సైట్ల బెడద నుంచి భావి భారతాన్ని కాపాడుకొనేలా, పాఠశాల స్థాయి నుంచే బాలబాలికల్లో రుజువర్తనకు పాదుచేసేలా పటిష్ఠ కార్యాచరణ వేరూనుకోవాలి. నిర్భయ, పోక్సో వంటి చట్టాలున్నా, నేరగాళ్ల పీచమణచడానికంటూ దేశవ్యాప్తంగా 400 సత్వర న్యాయాలయాల్ని ఏర్పాటు చేసినా ఏం ఒరిగింది? ప్రత్యేక కోర్టుల్లో ‘పోక్సో’ కింద నమోదైనవే లక్ష కేసులు పెండింగులో ఉన్న సమాచారం తీవ్ర నిస్పృహ రగిలిస్తోంది. రెండు నెలల్లో మొత్తం విచారణ ముగిసిపోవాల్సి ఉండగా, బాధితురాలి వాంగ్మూలం నమోదుకే దిల్లీ లాంటిచోట్ల ఎనిమిది నెలలు పట్టిందంటే ఏమనుకోవాలి? అంతకుమించి, పిల్లలపై నేరాల రేటులో ఎకాయెకి 26 శాతం వృద్ధి నమోదవుతుంటే, శిక్షల రేటు పాతిక శాతం లోపే ఉండటం- ఏటికేడు పరిస్థితులు విషమించడానికే దోహదం చేస్తోంది. ఈ దురవస్థను రూపుమాపేలా యుద్ధప్రాతిపదికన కార్యాచరణను మూడు నెలల్లో పట్టాలకెక్కిస్తామంటున్న మోదీ ప్రభుత్వం- పాఠశాలల్లో నైతికాంశాల బోధన, అంతర్జాలంలో అశ్లీలానికి అడ్డుకట్ట వంటి భిన్న పార్శ్వాలపై దృష్టి సారించాలి. రేపటి తరాన్ని జాగ్రత్తగా కాపాడుకొనే మహాక్రతువులో భిన్నవర్గాల క్రియాశీల భాగస్వామ్యమూ తప్పనిసరి!

No comments:

Post a Comment