సివిల్స్ నుంచి గ్రూప్స్ కి - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Monday, 23 April 2018

సివిల్స్ నుంచి గ్రూప్స్ కి

ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు నాన్న మాటలు ఇచ్చిన స్ఫూర్తి, సమాజానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు ఎంఎస్‌ఆర్‌కే సోమేష్‌. ఇటీవల ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్‌-1 ఫలితాల్లో ఆరో ర్యాంక్‌ సాధించాడు. ఈ నేపథ్యంలో సోమేష్‌ సక్సెస్‌ స్టోరీ అతని మాటల్లోనే..
 
గ్రూప్‌-1లో ఆరో ర్యాంక్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. పరీక్ష రాసిన తరవాత టాప్‌ 10లో ఉంటాను అనుకున్నాను. అదే జరిగింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో కలిపి 494 మార్కులు వచ్చాయి. ప్రస్తుత నోటిఫికేషన్‌లో రెండే డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. దీంతో రెండో ప్రాధాన్యం ఇచ్చిన సీటీఓ పోస్టు రావచ్చు.
 
సొంతంగా
ప్రస్తుతం బీహెచ్‌ఈఎల్‌ హైదరాబాద్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నాను. దాంతో ఉద్యోగ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండానే సొంతంగా ప్రిపరేషన్‌ సాగించాను. ముఖ్యంగా ఆన్‌లైన్‌ సోర్సెస్‌పై ఎక్కువగా ఆధారపడ్డాను. వాటికితోడు ఆల్‌ ఇండియా రేడియో న్యూస్‌, లోక్‌సభ, రాజ్యసభ టీవీల్లో చర్చలు, వార్తలను ఎక్కువగా ఫాలో అయ్యాను. అంతేకాకుండా తెలుగు, ఇంగ్లీష్‌ దినపత్రికల ఎడిటోరియల్స్‌ను తప్పకుండా చదివేవాణ్ని. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు అన్ని సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌కు ఉపయోగపడ్డాయి. ఇండియన్‌ పాలిటీ కోసం లక్ష్మీకాంత్‌, ఎకానమీ కోసం రమేష్‌ సింగ్‌ పుస్తకాలను చదివాను. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నేను చేస్తున్న జాబ్‌, విద్యానేపథ్యానికి చెందినవి కావడంతో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు.

సివిల్స్‌ నుంచి గ్రూప్స్‌
2012, 15, 16లలో మూడు సార్లు సివిల్స్‌ రాశాను. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి ప్రయత్నిద్దాం, విజయం సాధిస్తే సొంత రాష్ట్రంలోనే పని చేయవచ్చు కదా అనే ఉద్దేశంతో మొదటి సారి గ్రూప్‌-1 రాశాను. సివిల్స్‌ కోసం చేసిన ప్రిపరేషన్‌ గ్రూప్‌-1కు ఉపయోగపడటం బాగా కలిసొచ్చింది. తొలి ప్రయత్నంలోనే విజయం లభించడం మరింత ఆనందంగా ఉంది.
 
అవగాహనతో
ప్రిపరేషన్‌లో అన్ని సబ్జెక్ట్‌లకు సమ ప్రాధాన్యం ఇచ్చాను. ఈ స్థాయి పరీక్షల్లో సమాధానాన్ని ఎంత క్వాలిటీగా రాశారు అనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సమాధానాలను బెటర్‌గా ప్రెజెంట్‌ చేశాను. దినపత్రికల ఎడిటోరియల్స్‌, లోక్‌సభ, రాజ్యసభ టీవీల్లో వివిధ సబ్జెక్ట్‌లపై జరిగే చర్చలను నిశితంగా ఫాలో అయ్యేవాణ్ని. అందులోంచి కావల్సిన అంశాలను తీసుకొని వాటిని నా సొంత అవగాహనతో అన్వయించుకుంటూ సమాధానాలను రాశాను. ఈ అంశం బాగా కలిసొచ్చింది. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో 123.5 మార్కులు, ఎకానమీలో 91 మార్కులు వచ్చాయి.
 
ప్రశ్నించే విధానం మారింది
ప్రస్తుతం ప్రశ్నించే విధానం కూడా మారింది. గతంలో సంప్రదాయ ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం కాన్సెప్ట్స్‌ కంటే విశ్లేషణకు ప్రాముఖ్యతనిచ్చే ప్రశ్నలు ఇస్తున్నారు. సివిల్స్‌లో ఈ తరహాలో ప్రశ్నలను అడుగుతారు. సివిల్స్‌లో కూడా జనరల్‌ స్టడీస్‌కు ప్రాధాన్యం పెరిగింది. ప్రశ్నలను కరెంట్‌ అఫైర్స్‌తో రిలేట్‌ చేస్తూ ఇస్తారు. ఇదే విధానం ఈసారి గ్రూప్‌-1లో కనిపించింది.
 
ప్రతి క్షణాన్ని వినియోగించుకుంటూ
ఇంజనీరింగ్‌ నేపథ్యం అయినప్పటికీ సివిల్స్‌, గ్రూప్‌ ప్రిపరేషన్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు సమన్వయం చేసుకుంటూనే దొరికిన ప్రతి క్షణాన్ని వినియోగించుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాను. ఆఫీస్‌లో ఖాళీ సమయం ఉంటే ఇంటర్నెట్‌ ద్వారా సమాచారాన్ని సేకరించేవాణ్ని. ఆఫీస్‌ తరవాత, సెలవు దినాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌కు దూరంగా ఉంటూ విజయం సాధించాలనే కసితో చదివాను. ఇందుకు కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ఉంది.
 
ఇంటర్వ్యూ ఇలా
ఇంటర్వ్యూ ఆహ్లాదకరంగా జరిగింది. 25 నిమిషాలు ఇంటర్వ్యూ చేశారు. వ్యక్తిగత, వృత్తి నేపథ్యం ఆధారంగా ఎక్కువ ప్రశ్నలు అడిగారు. బీహెచ్‌ఈఎల్‌లో పని చేస్తుడటంతో దానికి సంబంధించి దేశంలో ఆర్‌ అండ్‌ డీ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి? అనే ప్రశ్న వేశారు. మా స్వస్థలం రాజోలుకు సంబంధించి.. రాజోలుకు చెందిన ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? అనే ప్రశ్న అడిగారు. అలాగే లంచం అంటే ఏమిటి? వంటి ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఇంటర్వ్యూలో 53 మార్కులు వచ్చాయి.
 
నాన్న మాటలే స్ఫూర్తి
సివిల్స్‌ అంటే చిన్నపట్పి నుంచి ఆసక్తి. నాన్నకు సామాజిక స్పృహ ఎక్కువ. మంచి ప్రభుత్య ఉద్యోగం సాధిస్తే సమాజానికి చేయడానికి మరింత అవకాశం ఉంటుందని నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఆ మాటలే నాకు స్ఫూర్తిగా, లక్ష్యంగా తీసుకున్నా. బీహెచ్‌ఈఎల్‌లో పని చేస్తున్నా కూడా నాన్న మాటలు ఇచ్చిన స్ఫూర్తితోనే సివిల్స్‌ దిశగా దృష్టి సారించాను. ఆ క్రమంలోనే ఈ విజయం దక్కింది. నేను, అక్కలు.. ముగ్గురం ప్రభుత్వ సర్వీసుల్లో ఉండటం చాలా ఆనందాన్ని కలిగించింది.
 
నేపథ్యం
మాస్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు. నాన్న వెంకటరామచంద్రుడు, అమ్మ సీత. మధ్య తరగతి కుటుంబం. అమ్మ, నాన్న ఇద్దరూ విద్యావంతులే. నాన్న వ్యవసాయం చేసేవారు. మేము ముగ్గురం. నేను, ఇద్దరక్కలు. ఒక అక్క సుబ్బలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఇంకో అక్క సుబ్రమణ్యేశ్వరి ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌లో పని చేస్తున్నారు. నేను మొదటి నుంచి మెరిట్‌ స్టూండెట్‌నే. ఏడో తరగతిలో 567 మార్కులతో జిల్లా ర్యాంక్‌, టెన్త్‌లో 544 మార్కులతో రాష్ట్రస్థాయిలో ర్యాంక్‌ వచ్చింది. ఇంటర్మీడియెట్‌లో 934 మార్కులు వచ్చాయి. 2005లో అవంతి ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి బీటెక్‌ (ఈఈఈ) పూర్తి చేశాను. 2006 మార్చిలో బీహెచ్‌ఈఎల్‌ భోపాల్‌లో ఉద్యోగం వచ్చింది. 2007 జూన్‌లో హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌కు బదిలీ అయింది.

No comments:

Post a Comment