ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం 2004 - 2012 మధ్య దాదాపు రెండు కోట్ల మంది భారతీయ మహిళలు వివాహం, డెలివరీ వంటి పలు కారణా లతో మధ్యలోనే ఉద్యోగాలను విడిచిపెట్టారు. వారిలో డెబ్బయ్ శాతం మంది మళ్ళీ ఉద్యోగాల్లో చేరలేదు.
బ్రేక్ తరవాత మహిళలకు జాబ్‌లో రీ ఎంట్రీ అనేది చాలా కష్టంతో కూడిన వ్యవహారం. కుటుంబ బాధ్యతలు, అనుకూల పనివేళలు లేకపోవడం లాంటివి ప్రధాన కారణాలు. అంతేకాకుండా జాబ్‌లో తిరిగి చేరే సమయానికి వర్క్ స్కిల్స్ మారుతుండడం మరో విశేషం. అయితే, రీ ఎంట్రీ కోరుకునే మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే కెరీర్ యథావిధిగా సాగుతుందని సీనియర్లు చెబుతున్నారు. టాటాలాంటి కొన్ని కంపెనీలు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఉద్యోగం మానేసి మళ్లీ చేరాలనుకునే మహిళలకు కొంత ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. ప్రైమరీ నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ వరకు బాలురతో పోల్చుకుంటే విద్యార్జనలో బాలికలే మెరుగు అన్నది విశ్లేషణల సారాంశం. చదువు, వర్క్‌లో మెరుగ్గా ఉండే మహిళలను వదులుకోవాలని కార్పొరేట్ కంపెనీలు భావించడం లేదు. సంబంధిత స్కిల్స్‌ను అప్‌డేట్ చేసుకుంటే బ్రేక్ తరవాతా మహిళల కెరీర్ బాగానే ఉంటుందన్నది నిపుణులు మాట.
నైపుణ్యాలు, లక్ష్యాల పునర్ అంచనా
కెరీర్ నుంచి పక్కకు తప్పుకొని చాలా కాలమైనప్పుడు అప్పటికి తనకు ఉన్న అవకాశాలు, వ్యక్తిగత బలాలు, అనుభవాన్ని మొదట అంచనా వేసుకోవాలి. ఆసక్తినీ పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో తను అంతకుముందు పనిచేసిన పరిశ్రమ లేదంటే నిర్వర్తించిన విధులు ఇప్పుడు సూట్ కాకపోవచ్చు. అందుకు కారణాలు ఏవైనా కావచ్చు. అంతకు ముందు తను చేసిన పని, ఇప్పుడు ఉన్న ఆసక్తిని అనుసరించి మరో పనివైపు మళ్ళాల్సి రావచ్చు. చాలాకాలం ఇంటిపట్టున ఉండటంతో టైమ్ మేనేజ్‌మెంట్, డెలిగేషన్‌తో కొలాబిరేషన్ విషయంలో గ్యాప్ ఏర్పడి ఉండవచ్చు. ఇలాంటి అంతరాలను విశ్లేషించుకుని మొదట వాటిని పూడ్చుకోవాలి.
లేటెస్ట్ ట్రెండ్స్‌పై దృష్టి
పని వాతావరణంలో మార్పులు, చేర్పులు సహజం. ఆ విషయంలో మొదట అప్‌డేట్ అవ్వాలి. నిరంతరం చదవడం లేదా పరిశ్రమలో ఉండటం ద్వారా మాత్రమే న్యూట్రెండ్స్‌పై అవగాహన కలుగుతుంది. ఒక వ్యక్తి ఎక్కడ పని చేశారు, ఏ పని చేశారు అన్నది ఎన్నటికీ విషయం కాదు. ప్రతి పనికి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయి. అందువల్ల ఎంచుకున్న పనిని ఉద్దేశించిన ట్రైనింగ్ మాడ్యూల్స్ పూర్తి, అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడం మాత్రమే విషయం అవుతుంది. ప్రస్తుత పోటీ వాతావరణంలో తదనుగుణ్యమైన నైపుణ్యాలను నేర్చుకున్నప్పుడు వృత్తిపరమైన విశ్వాసాన్ని పొందగలుగుతారు. ఇప్పటి యాజమాన్యాలు మహిళా శక్తిని గుర్తిస్తున్నాయి. పనికి అవసరమైన నైపుణ్యాలను వారికి నేర్పేందుకు ముందుకు వస్తున్నాయి. సంబంధిత శిక్షణతో మళ్ళీ వర్క్‌ఫోర్స్‌లో ఈ మహిళలు చేరి పూర్తి విశ్వాసంతో పనిచేయవచ్చు. నేడు అనేక షార్ట్ టెర్మ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అనువైన సమయంలో నేర్చుకునే వెసులుబాటూ కూడా కల్పిస్తున్నారు. వీటితో మళ్ళీ ఉద్యోగం చేసేందుకు సన్నద్ధం కావచ్చు.
వాలంటరీ, ఓకేషనల్ వర్క్
స్వచ్చందంగా లేదంటే వృత్తిపరంగా పని చేయడం ద్వారా నైపుణ్యాలకు సంబంధించి సరికొత్త అంశాలను నేర్చుకోవచ్చు. ఈ పద్ధతిలో మొదట ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మళ్ళీ పని చేయగలనని అనిపిస్తుంది. పని చేస్తూ నేర్చుకునే పద్ధతిలో సంబంధిత పరిజ్ఞానం బాగా నేర్చుకునే సౌలభ్యం ఉంటుంది. ఇంటర్నషిప్ కార్యక్రమాలు, ఇండస్ట్రీ మీట్‌లు, వివిధ నెట్‌వర్కింగ్ ఫోరాల్లో కలసి పనిచేయడం ద్వారా మహిళలు మళ్ళీ వృత్తికి పునరంకితం కావడమే కాదు, అవకాశాలనూ మెరుగుపర్చుకోవచ్చు.
మార్పునకు రెడీ
విరామం తరవాత తిరిగి ఉద్యోగంలో చేరాలను కుంటున్నప్పుడు మళ్ళీ పాత జాబే చేయాలని అనుకోవాల్సిన పని లేదు. అందులో మార్పులు చేర్పులు జరిగి ఉండవచ్చు. కాలక్రమేణా కొన్ని ఉద్యోగాలు పూర్తిగా అదృశ్యం కావచ్చు. అందులో మీ ఉద్యోగమూ ఉండొచ్చు. మళ్ళీ చేరేటప్పుడు మార్పునకు సిద్ధంగా ఉండి అనువైనదేదో ఎంచుకోవాలి. ఎక్కువ ఒత్తిడికి లోనుకారాదు. ఓపెన్ మైండ్‌తో కాకతాళీయంగా అన్నట్టు తలుపుతీసి గదిలోకి అడుగుపెట్టేలా చూసుకోవాలి. ముఖ్యంగా బ్రేక్‌ను లెర్నింగ్ హాలీడే అనుకోరాదు. లెర్నింగ్ అన్నది నిరంతర ప్రక్రియగానే గుర్తించాలి, గుర్తుంచుకోవాలి.
No comments:
Post a Comment