క్షమాపణ - శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం

Breaking

Friday, 7 September 2018

క్షమాపణ



మానవుల్లో విభిన్నమైన వ్యక్తిత్వాలు ఉంటాయి. కొందరి మాటల వల్ల మన మనసు గాయపడుతుంది. మరి కొన్నిసార్లు మన మాటలు ఇతరులను గాయపరుస్తాయి. ఈ రెండు పరిస్థితుల్లోనూ వేదనను నివారించలేం. మనసు పడిన గాయాన్ని మాన్పడం చాలా కష్టం. వేదన తెరలు తెరలుగా ఉబికివస్తూ మనిషి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ స్థితిలో క్షమించడమనే ఆత్మసంబంధిత సాధన మనసును నిర్మలం చేస్తుంది. మాటపడ్డవాడు, మాట్లాడినవాడూ ఇద్దరిలో క్షమాగుణం ఉంటే ఈ సమాజంలో కలతలు, కక్షలకు తావే ఉండదు. మహాభారతం మొత్తంలో మనకు కనబడే నీతి ఇదే!

మాయాజూదంలో పాండవుల రాజ్యం మొత్తం సంగ్రహించిన తరవాత విదురుడు అంటాడు- ‘సుయోధనా! జూదంలో ఓడినవారు నీ సోదరులే. ఇదేమీ యుద్ధం కాదు. దయచేసి పాండవుల రాజ్యం పాండవులకు ఇచ్చివేయి. అది నీ గొప్పతనానికి కారణమవుతుంది’.
కానీ సుయోధనుడు వినడు. యుద్ధాన్ని చేతులారా తెచ్చుకుని కురు సామ్రాజ్య పతనానికి కారణమవుతాడు. పన్నెండేళ్ల అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం అనంతరం సైతం కౌరవులు చేసిన ద్రోహాన్ని పాండవులు క్షమించి కృష్ణుణ్ని రాయబారిగా పంపి అయిదు ఊళ్లయినా ఇమ్మని కోరతారు. అందుకూ కౌరవులు ఒప్పుకోలేదు. చిన్నపాటి క్షమాగుణం మహాభారత యుద్ధాన్ని ఆపి ఉండేది.

పరమాత్ముడి దృష్టికోణంలో మొత్తం సృజన ఆయన భావాతీత విస్తరణే. ఈ విస్తరణలో మనమూ అంశాలమే! పరమాత్ముడిలో క్షమాగుణం అనంతమైనదని పురుష సూక్తం చెబుతోంది. జీవరాశులన్నీ ఆయనలోని భాగమే కనుక క్షమాగుణం అందరిలో నిండే ఉంటుంది. బ్రహ్మసూత్రాలను అనుసరించి, దైవంలోని అన్ని గుణాలు మనలో ఉన్నా వాటిని సాధన చేసి వ్యక్తపరచుకోవాలి. ఈ క్షమాగుణమూ అంతే! స్వాతి తిరునాళ్‌, త్యాగయ్య, రామదాసు లాంటి భక్తులందరూ... తాము తెలిసీ తెలియక చేసిన పాపాలను మన్నించమని భగవంతుణ్ని ప్రార్థించారు. ఆ దైవం వారికి సద్గతులను ప్రసాదించాడు.

‘నేను మీ మనసు నొప్పించి ఉంటే క్షంతవ్యుడిని’ అని ఒక్క మాట అంటే చాలు. ఎదుటివాడిలో క్షమాగుణం చైతన్యవంతమై క్షమించేస్తాడు... ఆపై అంతా సుహృద్భావమే! భగవద్గీత పదో అధ్యాయం విభూతి యోగంలోని నాలుగో శ్లోకంలో క్షమాగుణం గురించి శ్రీకృష్ణ పరమాత్మ విపులంగా చెప్పాడు. క్షమాగుణం భగవద్దత్తమైనదని ఆయన వివరించాడు. మనుషుల్లోని జ్ఞానానికి, వివేకానికి క్షమాగుణం ప్రతిరూపమని అన్నాడు. పంచేంద్రియాలను అదుపులో ఉంచేందుకు క్షమాగుణం కారణమవుతుందని పరమాత్మ వెల్లడించాడు.

తప్పులు చేయడం మానవ సహజం. అలా చేయకుండా ఉండాల్సింది అన్నదే పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపమే క్షమాగుణానికి పునాది. కళింగ యుద్ధంలో వేలాది సైనికులు, పౌరులు మరణించడం చూసిన సమ్రాట్‌ అశోకుడు తీవ్ర పశ్చాత్తాపానికి గురై అహింసకు ప్రతిరూపమైన బౌద్ధాన్ని స్వీకరించాడు. ఆ తరవాత అశోకుడు, తన దేశంలో మరణశిక్షను రద్దు చేశాడంటారు. తప్పు చేసినవారిని పరిషత్తుకు పిలిపించి ఆ తప్పు వల్ల సంభవించే పరిణామాలను వివరించి పంపించేసేవారట. ఇతరులను క్షమించడంవల్ల తనలో కలిగే భావ సౌందర్యాన్ని వినయుడు అనే బౌద్ధ భిక్షువుకు అశోకుడు వివరించినట్లు కథనాలున్నాయి. క్షమాగుణం మనిషిని ఉన్నతస్థానంలో నిలుపుతుంది. క్షమ పొందినవాడి దృష్టిలో క్షమించినవాడు సాక్షాత్తు దైవస్వరూపుడని గాంధీజీ అనేవారు. క్షమాగుణం కలిగిన వాడికి సహజంగానే శత్రువులు ఉండరు. భారతంలో విదురుడు, అక్రూరుడు లాంటి మహానుభావులు ఆ కోవకు చెందినవారే. కురు పాండవులిరువురివద్దా వారికి గౌరవ ప్రపత్తులు ఉండేవి. క్షమించడం వారి నైజం.అందుకే వారు అజాత శత్రువులయ్యారు!


No comments:

Post a Comment