నిర్భయ ఘోరం తర్వాత కథువా దారుణం జరిగింది. ఇలాంటివి మామూలేనని ఆశ్చర్యపోకుండా ఉండకూడదు. న్యాయవాదులే న్యాయ ప్రక్రియను అడ్డుకున్నప్పుడు ఆశ్చర్యపోవాల్సిందే. కథువా అంతటి ఘోరమైన అకృత్యాన్ని నిర్ద్వంద్వంగా ఖండించడానికి కూడా రాజకీయ లాభనష్టాలు బేరీజువేసే పాలకులు తటస్థపడ్డప్పుడు ఆశ్చర్యపోకపోతే ఎలా? ఆశ్చర్యపోయే లక్షణాన్ని మనం కోల్పోకూడదు. అలా జరిగితే మంచికీ చెడుకూ స్పందించే గుణాన్ని సమాజం కోల్పోయినట్లే.
కథువా అమానుషం దేశం మొత్తాన్నీ కుదుపుతోంది. ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన దారుణం దేశం అంతరాత్మను కెలుకుతోంది. ప్రజల నుండి వ్యక్తం అవుతున్న ఆగ్రహావేశాల తీవ్రత అంతకంతకూ చిక్కనవుతోంది. ఏ విధంగా చూసినా జరిగింది మాటలకందని ఘాతుకం. ఎవరూ కూడా చలించకుండా ఉండలేరు; ఖండించకుండా ఉండలేరు. దీనికి మినహాయింపుగా మరో గొంతు వినబడకూడదు.
మరి వేరే గొంతులు వినబడుతున్నాయేమిటి? సోషల్ మీడియా వేదికలు చూడండి, మరో రకంగా వినబడే గొంతులు ఎన్ని వున్నాయో తెలుస్తుంది! కథువా రాక్షసం ఖండనల తీవ్రత పెరిగే కొద్దీ ఈ గొంతులు వినబడడం మొదలయింది. దీనితో సోషల్ మీడియాలో తీవ్రంగా వాదోపవాదాలు సాగుతున్నాయి. ఈ గొంతులు సంధించే ప్రధానమైన ప్రశ్న ‘‘రేప్‌కు మతం ఉంటుందా’’?
ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో వస్తున్న కామెంట్లు చూస్తుంటే ఇలా ప్రశించేవారిలో కూడా రెండు రకాల వ్యక్తులు కనబడతారు. మొదటి రకం తమంతట తాముగా ఈ ప్రశ్న వేస్తున్న వారు కారు. వేరొకరి నుంచి వచ్చిన ప్రశ్న చూసి ‘అవును నిజమే కదా’ అనుకుని ఆ సమూహంలో చేరినవారు. ఈ అంతటా కూడా హిందువులేనని చెప్పాల్సిన పని లేదనుకుంటాను. ప్రత్యేకంగా వీరికి, మెజారిటీ మతం ఆధిక్యత భావనను నమ్మే తత్వమో, మైనారిటీలంటే గిట్టని తత్వమో ప్రత్యేకంగా ఉండకపోవచ్చు. కథువా ఘోరం పట్ల మనసు చలించినా, ఇందులో మతం కోణం బయటకు రావడం గిట్టకపోయి ఉండవచ్చు. అదే అయితే, ఇంతటి భయంకరమైన మకిలి తన లాంటి హిందువులందరికీ ఎంతో కొంత అంటుకుంటుందన్న అపరాధ భావన అందుకు కారణం కావచ్చు. ఏది ఏమైనా వారికి ప్రత్యేకమైన ‘మోటివ్’ను ఆపాదించలేం.
ఇక రెండవ రకం గొంతుల దగ్గరకు వద్దాం; వీరికి హిందూ ఆధిక్యతా భావనను నమ్మేతత్వం ఉండవచ్చు. ఉండక పోవచ్చు. అయితే హిందూ సమాజం ఏకం కావాలన్న వాంఛ ప్రగాఢంగా కలవారు. ముస్లింల పోడ అసలు గిట్టకపోవడమో; ప్రపంచం, భారతదేశం సంక్షుభిత పరిస్థితులను ఎదుర్కొంటున్నదానికి ముస్లిం టెర్రరిజమే కారణమని నమ్మడమో వీరిలో కనబడుతుంది. వాయువ్య దిశ నుండి దండెత్తి వచ్చిన ముస్లిం రాజుల తరతరాల పాలనే నేడు భారతదేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ మూలమన్న హిందూత్వవాదుల ప్రచారంలో వీరికి నిజం కనబడుతుంది.
స్వాతంత్ర్యానంతర భారతదేశంలో దశాబ్దాల పాటు ప్రభుత్వాలు అనుసరించిన మైనారిటి ‘బుజ్జగింపు విధానాల వల్ల దేశం నష్టపోయిందన్న వాదనను వీరు విశ్వసిస్తారు. స్థూలంగా చెప్పాలంటే వీరు సంఘ్‌పరివార్ భావజాలానికి బాగా దగ్గరగా ఉండేవారు; హిందూ సమాజం ఏకం కావాల్సిన ‘చారిత్రక అవసరాన్ని’ భారతీయ జనతా పార్టీ మాత్రమే నెరవేర్చగలదని నమ్మేవారు.
రేప్‌కు మతం ఉంటుందా అన్న ప్రశ్న వీరి నుండి రావడానికి కారణం ఏమిటంటే కథువా దారుణకాండ తమకు మానసికంగా దగ్గరయిన బిజెపిని రాజకీయంగా దెబ్బతీస్తుందేమోనన్న భయం. వీరే కాదు మరోరకమైన ప్రశ్న సంధించేవారూ మనకు సోషల్ మీడియాలో కనబడతారు. కథువా దారుణంపై ఇంత గొంతు చించుకుంటున్నవారికి ఫలానాచోట – ఫలానా రోజు హిందూ యువతిని ముస్లింలు రేప్ చేసిన సంగతి తెలియదా, ఆ రోజున ఎందుకు గొంతు చించుకోలేదు అని వారు ప్రశ్నిస్తారు. పైన చెప్పిన వారిలాగా వీరు ఇలాంటి ప్రశ్నలు వెయ్యడానికి కూడా రాజకీయ ఎజెండానే కారణం.
అత్యాచారానికి మతం ఉంటుందా అన్న ప్రశ్న చూడడానికి చాలా అమాయకంగా కనబడుతుంది. భారతదేశంలో మెజారిటి మతస్థులు టెర్రరిస్టు చర్యలకు పాల్పడడం మొదలయినపుడు కూడా ఇలాంటి ప్రశ్నే ఎదురయింది. చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి నేరం ఎవరు చేసినా ఒకటే అన్న పద్ధతిలో సాగే ఈ వాదన పైకి ఎలా కనబడినా చాలా ప్రమాదకరమైన వాదన. నేరాన్ని కేవలం నేరంగా మాత్రమే చూస్తూ దాని వెనకున్న సామాజిక కోణాలను స్పృశించ నిరాకరించే వాదన. ప్రత్యేకించి నేరం వెనకున్న రాజకీయ ఫిలాసఫిని గుర్తించ నిరాకరించే వాదన. ఒక్క మాటలో చెప్పాలంటే నేరం వెనకున్న ‘మోటివ్’ను చూసేందుకు నిరాకరించే వాదన. వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించడాన్ని తిరస్కరించే ఈ వాదన క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ సూత్రాలకు కూడా విరుద్ధం.
కథువా దారుణాన్ని చూస్తే, దాని తర్వాత జమ్మూలో చోటు చేసుకున్న పరిణామాలే ఆ సంఘటనను మనం ఎలా పరిగణించాలో స్పష్టం చేస్తాయి. నేరం జరిగిన గ్రామం దగ్గర ఉంటున్న బకర్వాల్ అనే సంచార ముస్లిం తెగ కుటుంబాలను అక్కడ నుంచి వెళ్లగొట్టి వారి ‘బెడద’ లేకుండా చేసుకునే ఉద్దేశ్యంతోనే నిందితులు బాలికపై ఘోరమైన అకృత్యానికి పాల్పడినట్లు క్రైంబ్రాంచ్ పోలీసుల ఛార్జిషీటు స్పష్టం చేస్తున్నది. కళ్లను కప్పేసిన కామం కాదు ఈ నేరానికి కారణం ఈ ఘోరానికి కుట్ర పన్నిన సాంజీరామ్ బాలికను ముట్టుకోనేలేదు.
జరిగిన దారుణం పూర్వాపరాలు అన్నీ క్రైంబ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో బయటకు వచ్చిన తర్వాత అసలు తమాషా మొదలయింది. సాంజీరామ్ స్థాపించి నిర్వహిస్తున్న దేవీ ఆలయంలో అత్యంత పాశవికంగా రోజుల తరబడి ఆ ఎనిమిదేళ్ల బాలికపై సాగిన అత్యాచారాలను వివరిస్తూ క్రైంబ్రాంచ్ పోలీసులు రూపొందించిన ఛార్జిషీటును కథువా కోర్టులో దాఖలు చేయకుండా అడ్డుకునేందుకు ఏకంగా న్యాయవాదులే తీవ్రంగా ప్రయత్నించారు.
మరోపక్క హిందూ ఏక్తామంచ్ అనే సంస్థ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. ఈ సంస్థలో సభ్యులుగా బిజెపి ప్రముఖులు చాలా మంది వున్నారు. ప్రధాన నిందితుడు సాంజీరామ్‌కు కూడా హిందూ ఏక్తామంచ్‌తో సంబంధాలు ఉన్నాయి. ‘జైశ్రీరాం’ అంటూ నినదిస్తూ జాతీయ జెండాలు చేతబట్టి హిందూ ఏక్తామంచ్ చేపట్టిన నిరసన ర్యాలీకి అగ్రభాగాన ఆ రాష్ట్ర బిజెపి కార్యదర్శి ఒకరు నడిచారు. ఆ తర్వాత అరెస్టులను నిరసిస్తూ, కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ జరిగిన బహిరంగ సభలో ఇద్దరు బిజెపి మంత్రులు ప్రసంగించారు.
ఒక భయంకరమైన నేరానికి పాల్పడడం ద్వారా బకర్వాల్ తెగ ముస్లింల ‘బెడద’ లేకుండా చేసుకోవాలన్న నిందితుల ఆలోచనే కథువా దారుణానికి కారణమని సులువుగా నిర్ధారణకు రావచ్చు. ఆ తెగవారు ముస్లింలు కావడమే అసలు సమస్య అన్న వాదనను మాత్రం ఎవరైనా తప్పు పట్టవచ్చు; భూమి తగాదాలకు మతం రంగు పులుముతున్నారని వాదించవచ్చు. వాదన కోసం ఆ వాదనను కాస్సేపు ఒప్పుకున్నా నిందితుల పక్షాన అక్కడి హిందూ సమాజం నిలబడిన తీరు కథువా ఉదంతం అసలు కోణాన్ని ఆవిష్కరిస్తున్నది.
ముందే చెప్పినట్లు అత్యాచారానికి మతం ఉంటుందా అన్న ప్రశ్న చాలా అమాయకంగా, సబబుగా కనబడుతుంది. కానీ ప్రతి నేరానికీ ‘మోటివ్’ ఉంటుంది. ఆ మోటివ్ లోతును పరిశీలించినపుడు బయటకు వచ్చే నిజాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. అవును, కఠోరమైన వాస్తవాలు ఎదురయినపుడు మనం వాటిని చూసి తప్పక ఆశ్చర్యపోవాలి.
నిర్భయ ఘోరం తర్వాత కథువా దారుణం జరిగింది. ఇలాంటివి మామూలేనని ఆశ్చర్యపోకుండా ఉండకూడదు. న్యాయాధికారులైన న్యాయవాదులే న్యాయ ప్రక్రియను అడ్డుకున్నప్పుడు ఆశ్చర్యపోవాల్సిందే. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రభుత్వంలో చేరిన మంత్రులు నిందితుల పక్షాన బహిరంగ సభల్లో పాల్గొంటున్న ఉదంతాలు ఎదురయినప్పుడు ఆశ్చర్యం కలగాల్సిందే.
కథువా అంతటి ఘోరమైన అకృత్యాన్ని నిర్ద్వంద్వంగా ఖండించడానికి కూడా రాజకీయ లాభ నష్టాలు బేరీజువేసే పాలకులు తటస్థపడ్డప్పుడు ఆశ్చర్యపోకపోతే ఎలా? ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోయే లక్షణాన్ని మనం కోల్పోకూడదు. అలా జరిగితే మంచికీ చెడుకూ స్పందించే గుణాన్ని సమాజం కోల్పోయినట్లే. అలాగే కథువాలాంటి ఘోరాల తర్వాత రేప్‌కు మతం ఉంటుందా అన్న ప్రశ్న ఎదురయినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోవాలి.
No comments:
Post a Comment