కొండ అంచుల్లో విద్యా బాటలు..
విద్యార్థులను బడికి తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్తున్న మాస్టారు
శ్రీకాకుళంలో ఓ టీచర్ ఆదర్శం
సమయానికి రారు. వచ్చినా పాఠాలు చెప్పరు. మాస్టారు రాలేదంటే ఆ రోజుకు బడి లేనట్టే! ఏకోపాధ్యాయ టీచర్ల గురించి సాధారణంగా ఇలాంటి మాటలే వింటుం టాం! కానీ.. అలాంటివారే కాదు చీడి బాలకృష్ణ లాంటి ఆదర్శ టీచర్లూ ఉంటారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం ప్రాంతంలోని మహాలక్ష్మిపురం పంచాయతీ పరిధిలోని అటవీ గ్రామం మామిడిజోల. ఈ గిరిజన గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ చుట్టుపక్కల కొండలపై అక్కడక్కడా గ్రామాలున్నాయి. మామిడిజోలలోని బడికి రావాలంటే పిల్లలు ఆ కొండలను జాగ్రత్తగా దిగి, 2 కిలోమీటర్లు నడవాలి. దీంతో పిల్లలను స్కూలుకు పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు. 2011లో ఆ పాఠశాలకు చీడి బాలకృష్ణ అనే యువకుడు ఉపాధ్యాయునిగా వచ్చేనాటికి పరిస్థితి ఇది. స్కూల్‌లో 9 మందే ఉన్నారు. ఆ సంఖ్య ఇప్పుడు 36కు చేరింది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ ఏడేళ్లలో ఇంత మార్పు అసాధ్యం. అయితే, అది అద్భుతం కానేకాదు, టీచర్ బాలకృష్ణ నిలిపిన ఆదర్శం! ఏకోపాధ్యాయునిగా ఆ బడికి వచ్చిన బాలకృష్ణ.. పిల్లల సంఖ్య తగ్గిపోవడంపై ఆరా తీశారు. కొండలు ఎక్కి దిగలేకపోతున్న పిల్లల అవస్థను గురించి తెలుసుకొన్నారు.
ఒక రోజు ఏంజరిగిందంటే..
ఒకనాడు బడి వదిలిపెట్టిన తరువాత బాలకృష్ణ పిల్లలతో పాటు కొండ అంచు గ్రామాలకు వెళ్లారు. పిల్లలు ఉన్న తల్లిదండ్రులను కలుసుకొన్నారు. పేదరికం కారణంగా ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు లేని తాను, ఎలా టీచరుగా ఎదిగొచ్చిందీ ఓపిగ్గా చెప్పారు. ‘మీ పిల్లల బాధ్యత నాది’ అని తల్లిదండ్రులను ఒప్పించారు. మర్నాటి నుంచి వారిని వెంట పెట్టుకొని తన మోటారు బైకుపై విడతలవారీగా వారిని స్కూలు దగ్గరకు చేర్చడం, సాయంత్రం తిరిగి పిల్లలను వారి ఇంటి దగ్గర దిగబెట్టడం మొదలుపెట్టారు. ఇలా గత ఏడేళ్లుగా పిల్లలను బాలకృష్ణ అంటిపెట్టుకొనే ఉంటున్నారు. స్కూలులో కూడా వారి బంగారు భవితకు బాటలు వేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి వసతులతోనే ఆధునిక పద్ధతుల్లో పిల్లలకు విద్యాబోధన చేస్తున్నారు. స్కూలు వదిలిపెట్టిన తరువాత ఆయన ప్రత్యేక క్లాసులు తీసుకొంటున్నారు.
తల్లిదండ్రులను స్కూలుకు పిలిపించి, వారి పిల్లల చదువు, ఆసక్తుల గురించి అర్థమయ్యేలా చెబుతున్నారు. బొమ్మల బోధనా పద్ధతి, రేడియో పాఠాల ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచుతున్నారు. పిల్లల్లోని ప్రతిభను వెలికితీయడం కోసం సొంత ఖర్చుతో పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తున్నారు. చిన్న చిన్న పరికరాలను ఉపయోగించి వైజ్ఞానిక విషయాలను బోధిస్తున్నారు. ప్రకృతిలో జీవించే గిరిజన విద్యార్థులకు తగినట్టే స్కూలు పరిసరాలను పచ్చగా తీర్చిదిద్దారు. బాలకృష్ణ కృషి వృథా పోలేదు. స్కూలులో పిల్లల సంఖ్య పెరగడంతో పాటు, స్కూలు స్థాయి కూడా పెరిగింది. 2016-17లో మామిడిజోల పాఠశాలకు రెండో ఉపాధ్యాయ పోస్టును ప్రభుత్వం మంజూరు చేసింది.
No comments:
Post a Comment