ఉద్యాన కుసుమం సుభాషిణి
హార్టికల్చర్‌లో రాణిస్తున్న మహిళా అధికారిణి
వాణిజ్య పంటలవైపు
రైతులకు దిశానిర్దేశం
ఆమె పుట్టింది సాధారణ రైతు కుటుంబంలో. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో తండ్రి పడిన కష్టాల్ని, నష్టాల్ని చిన్ననాటినుంచే దగ్గరగా చూసిందామె. లాభసాటి వ్యవసాయం రైతులకు అందించాలనే లక్ష్యంతో పట్టుబట్టి ఉద్యాన కోర్సు చదివారు. అంతే పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం సాధించి పల్లెపల్లె తిరుగుతూ వేలాది మంది రైతులకు సలహాలిచ్చి వాణిజ్య పంటల వైపు మళ్లించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. జిల్లా ఉద్యానవన శాఖపై చెరగని ముద్ర వేసిన పీలేరు విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ సుభాషిణిపై ప్రత్యేక కథనం.
ఎర్రావారిపాళెం మండలం ఉదయమాణిక్యం పంచాయతీ తొగటపల్లెకు చెందిన శిబ్బాల సుబ్బరామయ్య, రాజమ్మల మొదటి సంతానం సుభాషిణి.తండ్రి రైతు, తల్లి ఉపాధ్యా యురాలు. వ్యవసాయంలో తండ్రి పడే కష్టం, వరుస నష్టాలను చూసి సుభాషిణి చలించిపోయింది. తల్లిదండ్రు లను ఒప్పించి ఉద్యానవన కోర్సు చదవాలని సుభాషిణి నిర్ణయించుకున్నారు. రాజేంద్రనగర్‌లో హార్టికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి 1992లొ ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించారు. పీలేరు ఉద్యానవన అధికారిగా(హెచ్‌వో)గా ఉద్యోగజీవి తాన్ని ప్రారంభించిన ఆమె ప్రస్తుతం పీలేరులోనే ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులుగా(ఏడీ) పని చేస్తున్నారు. రైతుల కష్టాలు తెలిసిన రైతుబిడ్డగా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలనే పట్టుదలతో పని చేస్తూ వచ్చారు. సాంప్రదాయ పంటలైన వరి, వేరుశెనగ, చెరుకు పంటలు కాకుండా వాణిజ్య పంటలైన బొప్పాయి, మామిడి, దానిమ్మ, చేమంతి సాగు చేయడంలో రైతుల్ని చైతన్యవంతుల్ని చేశారు. వందలాది సదస్సులు, అవగాహన శిబిరాలు నిర్వహించి వారిలో చైతన్యాన్ని రగిలించారు. ఆమె కృషి ఫలితంగా అనేక వందలాది రైతులు ఉద్యాన పంటలవైపు దృష్టి సారించారు.
వారికి ప్రోత్సాహకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సబ్సిడీ పథకాలను నేరుగా రైతులకే దక్కేలా ఆమె పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. ఆధునిక పద్ధతుల్ని అందిపుచ్చుకుంటే రైతులు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చునని, రైతు సుభిక్షంగా ఉన్నప్పుడే సమాజం బాగుంటుందని ఆమె బలంగా విశ్వసిస్తారు. అందుకే ఆమె సామూహిక సేద్యం వైపు కూడా రైతుల్ని కదిలించారు. గ్రామంలోని రైతుల్ని సంఘాలుగా కలపడం, సామూహిక పంటల సాగుకు సన్నద్ధం చేయడం, ఫలితాలను సమానంగా పంచుకోవడం వంటి పద్ధతులను ఆమె విజయవంతంగా అమలు చేయిస్తున్నారు. పులిచెర్ల మండలం అరవవాండ్లపల్లెలో ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్మించిన కమ్యూనిటీ ఫారం పాండ్ నిర్మాణాన్ని సాక్షాత్తు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నారు. ఆ కమ్యూనిటీ ఫారం పాండ్‌ను సీఎం ప్రత్యేకంగా సందర్శించి ఆమె పనితీరు ఆదర్శనీయమని ప్రశంసించారు. అంతే కాకుండా ఉద్యానవన పంటల్లో ఇటీవల వస్తున్న మార్పు ల్ని గమనించి ఆపిల్ బేర్, బొప్పాయి, దానిమ్మ, ఆయిల్ పామ్ వంటి పంటల్ని కూడా సాగు చేయిస్తున్నారు. జిల్లాలోని 66 మండలాల్లో ప్రస్తుతం ఆమె పరిధిలో 33 మండలాలు ఉన్నాయి. తూర్పున సత్యవేడు మొదలుకుని పడమట వాల్మీకిపురం వరకు ఆమె ప్రతిరోజూ అలుపెరుగని ప్రయాణం చేస్తూ రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు.
సుభాషిణి సాధించిన విజయాలు
- మండలాల్లో సామూహిక సేద్యాన్ని ప్రోత్సహిస్తూ రైతుల కోసం కమ్యూనిటీ ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్‌ల నిర్మాణం
- పులిచెర్ల మండలం అరవవాండ్లపల్లె, వరదయ్యపాళెం మండలం రాజగోపాలపురం, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండలాల్లో నిర్మించిన కమ్యూనిటీ ఫారం పాండ్లు జిల్లాకే తలమానికంగా నిలిచాయి.
- జిల్లాలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఆయిల్‌పామ్ సాగు చేపట్టారు. నగరి, వరదయ్యపాళెం, కేవీబీపురం, శ్రీకాళహస్తి మండలాల్లో ప్రస్తుతం దాదాపు 40 హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు చేయిస్తున్నారు.
- మామిడి రైతులకు మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించడం, ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేయడం, వారితోనే సొంతంగా విక్రయ కేంద్రాల నిర్వహణ
- 2014-15 ఆర్థిక ఏడాది నుంచి రక్షిత వ్యవసాయ పథకాన్ని పెద్దఎత్తున పెంచి ప్రస్తుతం 14 యూనిట్లకు పెంచారు.
- చేమంతిలో పలు కొత్త రకాలు ప్రవేశపెట్టి రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నారు.
- మల్చింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి రైతులకు పెట్టుబడి ఖర్చును తగ్గిస్తున్నారు.
ఆత్మవిశ్వాసం తోడుంటే అంతా జయమే
మహిళలు రాణించలేని రంగం అంటూ ఏదీ లేదు. ముందువారు తాము ఎంచుకున్న రంగంపై అవగాహన పెంచుకోవాలి. ఒత్తిళ్లు, వివక్ష, సహాయ నిరాకరణ అన్ని చోట్లా ఉంటాయి. కొత్త వాతావరణాలను త్వరగా ఆకళింపు చేసుకోవడం, వాటికి అనుకూలంగా తమను తాము మలచుకోవడం అవసరం. అది ప్రతి మహిళలోనూ అంతర్లీనంగా ఉంటుంది. నా ఉద్యోగ జీవితంలో దాదాపు ప్రతిరోజూ ఫీల్డ్‌లోనే గడిపాను. మొదట్లో మగరాయుడు ఉద్యోగం చేస్తోందన్నారు. రైతులు కూడా ఏదో ఆడకూతురు వచ్చింది, ఒకసారి ఆమె చెప్పేది విందాంలే అన్నట్లు ఉండేవారు. కాలక్రమేణా నా పట్టుదల, శ్రమను గుర్తించిన వారు నా మాటల్ని విశ్వసించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆచరించడం మొదలెట్టారు. ప్రస్తుతం నేను ఏడీగా పనిచేస్తున్న 33 మండలాల్లో దాదాపు సగం మంది మహిళా ఉద్యానవన అధికారులు పనిచేస్తుండడం మరో విశేషం. మనలో నిజాయితీ, నిబద్ధత ఉంటే విజయాలు వాటంతట అవే వస్తాయి.
No comments:
Post a Comment